ఈ బ్లాగ్ రూపకర్త జె.రామాంజనేయులు(MCA)

27, జులై 2009, సోమవారం

కేతన

కేతన:
మూలఘటిక కేతన లేదా కేతన (1200-1280) తిక్కన యుగానికి చెందిన తెలుగు కవి. తిక్కన కాలానికి చెందిన కవులలో కేతన ప్రసిద్ధుడు. ఇతని తండ్రి "మారయ", తల్లి "సంకమాంబ". కేతన కొంతకాలం "వెంటిరాల" గ్రామానికి గ్రామాధికారిగా ఉండేవాడు. తరువాతి కాలంలో నెల్లూరుకు వలస వెళ్ళాడు. అక్కడ అతనికి మహాకవి తిక్కనతో పరిచయం ఏర్పడింది.

కేతన రచనలు
దశకుమార చరిత్ర : ఇది సంస్కృతంలో మహాకవి దండి వ్రాసిన వచన రచన "దశకుమార చరిత్ర"కు తెలుగు పద్యానువాదం. ఇందులో పది మంది యువకుల సాహస, ప్రేమ గాధలను కవి చక్కనైన పద్యాలలో వర్ణించాడు. ఇది 12 అధ్యాయాలు, 1625 పద్యాలు ఉన్న కావ్యం. ఇందులో కేతన ఆనాటి సంఘం స్వరూపాన్ని, ఆచారాలను. ఆభరణాలను వర్ణించాడు. సంస్కృత మూలంలో లేని పెక్కు సంప్రదాయాల వర్ణన ఈ కావ్యంలో కేతన పొందుపరచాడు. ఆంధ్ర ప్రాంతపు "కోడి పందేలాట" ను కూడా కేతన వర్ణించాడు.
ఆంధ్ర భాషా భూషణము : ఇది తెలుగులో మొట్టమొదటి స్వతంత్ర వ్యాకరణ గ్రంధం కావచ్చును. ఇందులో 196 పద్యాలున్నాయి. "తెలుగు", "తెనుగు" అనే రెండు పదాలను కేతన వాడాడు. తెలుగు భాష సంస్కృత భవం కాదని, స్వతంత్ర భాష అని కేతన అభిప్రాయపడ్డాడు.
విజ్ఞానేశ్వరము : యాజ్ఞవల్క్య స్మృతి ఆధారంగా సంస్కృతంలో విన్యానేశ్వరుడు వ్రాసిన "మితాక్షరి" అనే న్యాయశాస్త్ర గ్రంధానికి ఇది తెలుగు సేత. ఇందులో మూడు అధ్యాయాలు, 433 పద్యాలు ఉన్నాయి. ఇది తెలుగులో మొట్టమొదటి న్యాయశాస్త్ర గ్రంధఁ కావచ్చును. ఈ గ్రంధం ద్వారా అప్పటి ఆచారాలు, నియమాలు, జీవిత పరిస్థితులు కొంతవరకు తెలుస్తున్నాయి.