నారాయణ భట్టు:
నారాయణ భట్టు, తొలితరం తెలుగు కవిగా ప్రసిద్ధుడైన నన్నయకు ఆంధ్ర మహాభారత రచనలో సహాయపడినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పందితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ నారాయణులు యుగపురుషులు. రాజరాజనరేంద్రుని పాలన కాలంలో సాహిత్యపోషణకు అనుకూలమైన ప్రశాంతవాతావరణం క్రీ.శ. 1045-1060 మధ్యలో ఉంది. ఆ కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉంటుంది.
నారాయణభట్టు నన్నయకు సహాధ్యాయుడు అట. నారాయణభట్టు తనకు చేసిన సహాయాన్ని కీర్తిస్తూ నన్నయ చెప్పిన పద్యం -
పాయక పాక శాసనికి భారత ఘోరరణంబునందు
నారాయణునట్లు వాణస ధరామర వంశ విభూషణుండు
నారాయణభట్టు వాఙ్మయ ధురంధరుఁడుం దనకిష్టుఁడున్
సహాధ్యాయుడునైన వాఁడభిమత స్థితిఁ దోడయినిర్వహింపగాన్
నారాయణభట్టు ఎలాంటి సాయం చేశాడనే విషయంపై వివిధాభిప్రాయాలున్నాయి. వారు జంటకవులని కూడా కొందరంటారు. అయితే అది నిరాధారమని చెబుతూ పింగళి లక్ష్మీకాంతం ఇలా భావించాడు - "ఆయుధం పట్టకుండా కృష్ణుడు అర్జునునికి సాయం చేసినట్లే తాను స్వయంగా ఘంటం పట్టకుండా నారాయణభట్టు నన్నయకు తగిన సూచనలు ఇచ్చి ఉండవచ్చును. ఏ ప్రకరణం ఎలా పెంచాలి, కుదించాలి, సంస్కృతభారతాన్ని తెలుగులోకి ఎలా చేయాలి వంటి సముచితమైన సంప్రదింపులు వారిమధ్య జరిగి ఉండవచ్చును. గ్రంధారంభం నుండి తనకు చేదోడు వాదోడుగా సహాయపడుటనుబట్టియే నన్నయ కృతజ్ఞతాపూర్కంగా పై పద్యాన్ని చెప్పాడు. ఇది ఎంతో సార్ధకమైన పద్యము." నారాయణభట్టుకు రాజరాజనరేంద్రుడిచ్చిన నందంపూడి అగ్రహారం శాసనాన్ని నన్నియభట్టే వ్రాశాడు. అందులో "సంస్కృత కర్ణాట ప్రాకృత పైశాచికాంధ్ర భాషా సుకవి రాజశేఖర ఇతి ప్రథిత సుకవిత్వ విభవేన్" అని నారాయణభట్టుగురించి చెప్పాడు.
27, జులై 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి