ఈ బ్లాగ్ రూపకర్త జె.రామాంజనేయులు(MCA)

28, జులై 2009, మంగళవారం

త్యాగరాజు:

త్యాగరాజు:
త్యాగరాజు (మే 4, 1767 - జనవరి 6, 1847) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి.
జీవిత విశేషాలు
త్యాగరాజు ప్రస్తుత తమిళనాడు లోని తంజావూరు దగ్గరి తిరువయ్యూరు అను గ్రామం (అగ్రహారం) నందు తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం. ఇతడి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండలములోని కాకర్ల గ్రామమునుండి తమిళదేశానికి వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆదరంలో ఉండేవాడు. 18 సంవత్సరాల వయసులో త్యాగరాజుకు పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ ఆయన 23 వయస్సులో ఉండగా ఆమె మరణించడం జరిగింది. తరువాత ఆయన పార్వతి సోదరియైన కమలాంబను వివాహమాడాడు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనుమడు కలిగాడు కానీ యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే మరణించాడు. కాబట్టి త్యాగరాజుకు ఖచ్చితమైన వారసులెవరూ లేరు కానీ ఆయన ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది. భమిడిపాటి కామేశ్వర రావు గారు “త్యాగరాజ ఆత్మ విచారము” అనే పుస్తకం రాసారు. ఇందులో పుక్కిట పురాణ కథలు కనిపించవు. తత్వ, అధ్యాత్మిక విశ్లేషణ లతో త్యాగరాజ సంగీతమ్మీదొచ్చిన పుస్తకం ఇదొక్కటే. .ప్రజల మనసులకత్తుకోడం కోసం ఆయన జీవితంలోకి రాముడి లీలలూ, రక్షణలూ చొప్పించి ఆసక్తి కరంగా మలిచారు. రామ భక్తుడిగా పట్టాభిషేకం చేసేసి, చివరకి ఆయన్ని రాముడిలో లీనం చేసేసారు. ఆయన జీవితాన్ని పౌరాణిక గాధగా తీర్చి దిద్దారు.వ్యక్తిగా త్యాగరాజు ఎలా జీవించాడూ? అప్పట్లో ఉన్న యుద్ధాలూ, కల్లోలాలపై ఎలా స్పందించాడూ? ఆయన భార్యా, పిల్లలతో ఎలా గడిపాడూ?, శిష్యులకి ఎలా సంగీత బోధన చేసేవాడూ? ఇలా ఎన్నో వివరాలు ముందు తరాలకి అందకుండా పోయాయి
త్యాగరాజు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటరమణయ్య దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించాడు. పదమూడేండ్ల చిరు ప్రాయమునాడే త్యాగరాజు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచాడు. గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరచి పాడాడు. ఇది పంచరత్న కృతులలో ఐదవది. ఈ పాటకు వెంకటరమణయ్య చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి తంజావూరు రాజుగారికి చెప్పగా, రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించాడు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే నిధి చాల సుఖమా అనే కీర్తన. సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గముగా త్యాగరాజు భావించాడు. సంగీతంలోని రాగ, తాళములను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనముగా మాత్రమే చూసాడు.
తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినపుడు ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు, త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేసాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయములను, తీర్థములను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించాడు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందాడు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు శ్రీరామ సన్నిధిని చేరుకున్నాడు.
త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా ఇతనికి సంగీతంలోని రహస్యాలను చెప్పి, ఓ అద్భుతమైన పుస్తకం ఇచ్చాడనీ, ఆ సంధర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన "సాధించెనా" అనీ చెపుతారు.

త్యాగరాజు జీవితంలో కొన్ని సంఘటనలు
త్యాగరాజు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు పాడిన పాట: ఎందు దాగినావో
ఇతడు తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, తెరతీయగరాదా అనే పాట పాడితే తెరలు వేంకటేశ్వరుని దయచేత అవే తొలగిపోయినాయి. ఆ తరువాత ఆయన వేంకటేశ నిను సేవింప అనే పాట పాడినాడు.
త్యాగయ్య పరమపదము చేరటానికి ముందు పాడిన పాటలు: గిరిపై, పరితాపము

త్యాగరాజ ఆరాధనోత్సవాలు
అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటసంగీతానికి మూలస్థంభంగా చెపుతారు. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు (జనవరి, ఫిబ్రవరి నెలలలో) తిరువయ్యూర్ లో ఆయన సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభనందు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.
ఆయన భక్తులు మరియు సంగీత కళాకారులు మొదట ఉంచవృతి భజన, తరువాత ఆయన నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి ఆయన సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ సంగీత కర్ణాటక సంగీత కళాకారులు ఆయన రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు కానీ తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి గాంచినది. ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తున్న కళాకారుల మరియు సందర్శకుల కోసం ఇక్కడ ఒక పెద్ద భవనం కూడా నిర్మాణదశలో ఉంది.
సమాధి
త్యాగరాజ స్వామివారి మహాభక్తురాలు బెంగుళూరు నాగరత్నమ్మ కావేరీ నది ఒడ్డున శిధిలావస్థలోనున్న స్వామి వారి సమాధి చూసింది. ఆ స్థలాన్ని, దాని చుట్టు ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవిన్యూ అధికారుల ద్వారా తన వశము చేసికొని పరిశుభ్రము చేయించి, గుడి, గోడలు కట్టించింది. మదరాసులోని తన ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయప్రయాసల కోర్చి దేవాలయ నిర్మాణాన్ని ముగించింది. అక్టోబర్ 27, 1921లో పునాదిరాయిని నాటగా, జనవరి 7, 1925న గుడి కుంభాభిషేకము జరిగింది. స్థలాభావము వలన ఇంకా నేల కొని ఒక మంటపము, పాకశాల 1938లో నిర్మించింది. ఈ నిర్మాణములతో ఆమె సంపద, ఆభరణాలు హరించుకుపోయాయి. 1946లో త్యాగయ్య చిత్ర నిర్మాణసందర్భములో చిత్తూరు నాగయ్య గారు నాగరత్నమ్మను కలిశారు. ఆమె సలహాపై నాగయ్య గారు త్యాగరాజనిలయం అనే సత్రాన్ని కట్టించారు.
కీర్తనలు
త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించాడు.వీటిలో చాలావరకు ఆయన మాతృభాష ఐనటువంటి తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్న కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించబడిన జగదానందకారక అనే కీర్తన శ్రీరామునికున్న 108 పేర్లను ప్రస్తావిస్తుంది. 'ప్రహ్లాద భక్తి విజయం' అనే రూపకాన్ని కూడా రచించాడు. త్యాగరాజు కీర్తనల పూర్తి పట్టిక కోసం త్యాగరాజు కీర్తనలు అనే వ్యాసాన్ని చూడండి.