ఈ బ్లాగ్ రూపకర్త జె.రామాంజనేయులు(MCA)

28, జులై 2009, మంగళవారం

ఆరుద్ర:

ఆరుద్ర:
తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన ' త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మికూడా ప్రముఖ తెలుగు రచయిత్రి.

తొలి జీవితం
ప్రముఖ చిత్రకారుడు బాపు గీసిన ఆరుద్ర రేఖా చిత్రం
ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ హైస్కూల్ లో , తర్వాత విజయనగరంలో యం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. 1947-48 లో చెనై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి ' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. ఆరుద్ర మహాకవి శ్రీశ్రీకి వేలువిడిచిన మేనల్లుడు. ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు (చాసో) మార్కిస్టు భావాలను నూరిపోశాడని, ఆరుద్ర కవితాధోరణిలో శ్రీశ్రీ ప్రభావం కొంతవరకూ ఉందని సాహితీ విమర్శకులు అంటారు.

సాహిత్య సేవ
1946 లో చెన్నై వచ్చిన ఆరుద్ర కొంతకాలం పాటు చాలా కష్టాలు అనుభవించాడు. తినడానికి తిండిలేక పానగల్ పార్కులొ నీళ్ళు త్రాగి కడుపు నింపుకోవల్సి వచ్చిన సందర్భాలున్నాయని ఆరుద్ర చెప్పుకున్నాడు. అయితే ఈ ఇక్కట్లు ఏవీ సాహిత్య సేవకు అడ్డం రాలేదని ఆయన అన్నాడు. నెలకొకటి చొప్పున వ్రాస్తానని ప్రతిజ్ఞ చేసి డిటెక్టివ్ నవలలనుంచి మళ్ళీ అదే ప్రతిజ్ఞతో సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలవరకు ఆరుద్ర " దోహదం" తో పల్లవించని సాహితీ శాఖలేదు. త్వమేవాహంతో మొదలుపెట్టి వందలాదిగా గేయాలు , గేయ నాటికలు , కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ వ్యాసాలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు ఇవన్నీ కాక తన అసలు వృత్తి సినీ గీత రచన..... ఇంత వైవిధ్యంగల సాహిత్యోత్పత్తి చేసిన ఆధునికుడు మరొకడు కనబడడు.
తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితోపాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన సాహితీ ఉద్యమం అభ్యుదయ సాహిత్యం . అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు. వివిధ రంగాల్లోనే కాక వివిధ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి ఆరుద్ర. త్వమేవాహం , సినీవాలి , కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు వంటి అనేక కావ్యాలతో పాటు వెన్నెల- వేసవి , దక్షిణవేదం, జైలుగీతాలు వంటి అనువాద రచనలు రాదారి బంగళా, శ్రీకృష్ణదేవరాయ , కాటమరాజు కథ వంటి అనేక రూపకాలుతో పాటు కొన్నికథలనూ, నవలలనూ కూడా రచించాడు. సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( 14 సంపుటాలు) ఆరుద్ర పరిశోధనాదృష్టికి పరాకాష్ట. దీనికోసం మేధస్సునే కాకుండా , ఆరోగ్యాన్ని కూడా ఖర్చుపెట్టాడు. వేమన వేదం , మన వేమన, వ్యాస పీఠం, గురజాడ గురుపీఠం, ప్రజాకళలో ప్రగతివాదులు వంటివి ఆరుద్ర సాహిత్య విమర్శనా గ్రంథాలు. రాముడికి సీత ఏమౌతుంది?,గుడిలో సెక్స్ వంటి రచనలు ఆరుద్ర పరిశీలనా దృష్టికి అద్దంపడతాయి. సంగీతం పైనా, నాట్యం మీద రచించిన అనేక వ్యాసాలు ఇతర కళల్లో ఆరుద్ర అభినివేశాన్ని పట్టి చూపిస్తాయి. చదరంగం పైనకొన్ని దశాబ్ధాలకు పూర్వమే ఒక గ్రంథాన్ని ప్రకటించడం ఆరుద్రలోని మరో ప్రత్యేకత. ఇలా పలు రచనా ప్రక్రియలలో చేపట్టి, కవిత్వం- పరిశోధనా రెంటినీ వినియోగిస్తూ కవి పరిశోధకుడిగా నవ్యత కోసం పరితపించిన నిత్య శోధకుడు హేతువాది ఆరుద్ర.

రచనలు
కవిత్వం
త్వమేవాహం - 1948. ఇది ముఖ్యమైన తెలుగు రచనలలో ఒకటి. తెలంగాణా నిజా పాలనలలో జరిగిన రజాకార్ల అకృత్యమాలు ఈ రచన నేపధ్యం. మృత్యువు ఒక వ్యక్తితో నువ్వే నేను (త్వమేవాహం) అంటుంది. ఒకచోట రచయిత సమాజంలోని ఘటనలను, దృక్పధాలను ఊహాజనితమైన గడియారంతో పోలుస్తాడు.
సినీవాలి
గాయాలు-గేయాలు
కూనలమ్మ పదాలు
ఇంటింటి పద్యాలు
పైలా పచ్చీసు
ఎంచిన పద్యాలు
ఏటికేడాది
శుద్ధ మధ్యాక్కరలు.
జంట కవిత్వం
శ్రీశ్రీతో కలసి రుక్కుటేశ్వర శతకం,
శ్రీశ్రీ వరదలతో కలసి సాహిత్యోపనిషత్,
మేమే.
పరిశోధన, విమర్శలు, వ్యాసాలు
సమగ్ర ఆంధ్ర సాహిత్యం - ఇది తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారికి ఒక గొప్ప ఉపయుక్త గ్రంధం. ఇలాంటి రచన చేయడం అకాడమీలు, ప్రభుత్వ సంస్థలు వంటి వనరులు గలిగిన సంస్థలు మాత్రమే పూనుకొనగల పని. అటువంటి మహాకార్యాన్ని ఆరుద్ర ఒక్కడే తలకెత్తుకొని విజయవంతంగా పూర్తి చేశాడు. ఇది 1965, 1968లలో 12 సంపుటాలుగా వెలువడింది. ఇందులో తెలుగు సాహిత్యాన్ని ఆరుద్ర విభజించిన విధం ఇలా ఉంది.
పూర్వ యుగము, చాళుక్య చోళ కాలము - (800-1200)
కాకతీయుల కాలము (1200-1290)
పద్మనాయకుల కాలము (1337-1399)
రెడ్డిరాజుల కాలము (1400 - 1450)
రాయల ప్రాంభ కాలము (1450 - 1500)
రాయల అనంతర కాలము (1500 - 1550)
నవాబుల కాలము (1550 - 1600)
నాయకుల కాలము (1600 - 1670)
అనంతర నాయకుల కాలము (1670 - 1750)
కంపెనీ కాలము (1750-1850)
జమీందారుల కాలము (1850 - 1900)
ఆధునిక కాలము (1900 తరువాత)
రాముడికి సీత ఏమౌతుంది,
అరుద్ర వ్యాసపీఠం,
వేమన్న వాదం.
అనువాదాలు
వీర తెలంగాణా విప్లవగీతాలు (ఇంగ్లీషు నుంచి)
వెన్నెల- వేసవి ( తమిళం నుంచి)
కబీరు భావాలు - బట్వాడా ఆరుద్ర ( హిందీ నుంచి)
నాటికలు
ఉద్గీత
రాదారి బంగళా
సాల భంజికలు,
సినిమా పాటలు
1949లో బీదల పాట్లు అన్న చిత్రంలో .. " ఓ చిలుకరాజా నీ పెళ్లెప్పుడు ' అనే గీతంతో మొదలుపెట్టి దాదాపు నాలుగువేల సినిమా పాటలు వ్రాసాడు.
పెంకి పెళ్లాం చిత్రంలో - " పదచుదనం రైలుబండి పోతున్నది " ,
ఉయ్యాల జంపాల చిత్రంలో - " కొండగాలి తిరిగింది " , ఇదే చిత్రంలో " అందాల రాముడు ఇందీవర శ్యాముడు".
మీనా చిత్రంలో - " శ్రీరామ నామాలు శతకోటి" .
బందిపోటు చిత్రంలో " ఊహలు గుసగుసలాడే "
బాలరాజు కథ లో " మహాబలిపురం మహాబలిపురం "
ఆంధ్ర కేసరి చిత్రంలో " వేదంలా ప్రవహించే గోదావరి "
అత్తా ఒకింటి కోడలే " జోడుగుళ్ల పిస్తోలు ఠా "
యం.ఎల్.ఏ. చిత్రంలో " ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం మరియు " నీ ఆశ అడియాశ "
అందాల రాముడు చిత్రంలో " ఎదగడానికికెందుకురా తొందర "
గోరంత దీపం చిత్రంలో " రాయినైనా కాకపోతిని "
ముత్యాల ముగ్గు చిత్రంలో " ఏదో ఏదో అన్నది మసక వెలుతురు " మరియు ముత్యమంత పసుపు ముఖమెంతో చాయ
బాల భారతం చిత్రంలో " మానవుడే మహనీయుడు "
ఇద్దరు మిత్రులు చిత్రంలో - " హలో హలో అమ్మాయి "
ఆత్మ గౌరవం చిత్రంలో " రానని రాలేనని ఊరకె అంటావు. "
ఆత్మీయులు చిత్రంలో " స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు "
మొదలగు సినిమా పాటలు వ్రాసి పాటకు ఒక అర్థాన్ని పరమార్థాన్ని ప్రసాదించి ప్రతిపాటలో తన ముద్రను కనిపింపచేశాడు.
పురస్కారాలు
ఇతనికి 1985లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్) ప్రదానం చేసింది.