ఈ బ్లాగ్ రూపకర్త జె.రామాంజనేయులు(MCA)

28, జులై 2009, మంగళవారం

జాషువా:

జాషువా:
ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (Gurram Jashuva). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.
జీవిత విశేషాలు
జాషువా 1895 సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ లో జన్మించాడు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. ఈ ఒక్క విషయం చాలు, మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కోడానికి. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.
అయితే జాషువా ఊరుకొనేవాడు కాదు, తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టాడు. 1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేసాడు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈ పని. తరువాత గుంటూరులోని లూథరన్‌ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పని చేసాడు. తరువాత 1928 నుండి 1942 వరకు గుంటూరు లోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేసాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేసాడు. 1957-59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసాడు.
ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో ఆయన పద్యాలు చదివాడు. తక్కువ కులం వాడిని సభ లోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయనను అవమానించారు. ఆయనకు జరిగిన అవమానాలకు ఇది ఒక మచ్చు మాత్రమే. అంటరాని వాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండీ, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారు. ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారు. క్రమంగా ఆయన నాస్తికత్వం వైపు జరిగాడు.
జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి లో సభ్యత్వం లభించింది.
1971 జూలై 24న గుంటూరులో గుర్రం జాషువా మరణించాడు.

సాహితీ వ్యవసాయం
చిన్నతనం నుండీ జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. బాల్య స్నేహితుడూ, తరువాతి కాలంలో రచయితా అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం,రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు. జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాసాడు. వాటిలో ప్రముఖమైనవి:
గబ్బిలం
బాపూజీ
క్రొత్తలోకము
ముంతాజు మహలు
ఫిరదౌసి
నా కథ
కాందిశీకుడు
ఆంధ్ర మాత
గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశం లేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.
1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన. పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించాడు.
1948 లో రాసిన బాపూజీ - మహాత్మా గాంధీ మరణ వార్త విని ఆవేదనతో జాషువా సృష్టించిన స్మృత్యంజలి.
సంవత్సరాల వారీగా జాషువా రచనల జాబితా
1919 - రుక్మిణీ కళ్యాణం
1922 - చిదానంద ప్రభాతం, కుశలవోపాఖ్యానం
1924 - కోకిల
1925 - ధ్రువ విజయం, కృష్ణనాడి, సంసార సాగరం
1926 - శివాజీ ప్రబంధం, వీరాబాయి, కృష్ణదేవరాయలు, వేమన యోగీంద్రుడు, భారతమాత
1927 - భారత వీరుడు, సూర్యోదయం, చంద్రోదయం, గిజిగాడు
1928 - రణచ్యుతి, ఆంధ్రుడను, తుమ్మెద పెండ్లికొడుకు
1929 - సఖి, బుద్ధుడు, తెలుగు తల్లి, శిశువు, బాష్ప సందేశం
1930 - దీర్ఘ నిశ్వాసము, ప్రబోధము, శిల్పి, హెచ్చరిక, సాలీడు, మాతృప్రేమ
1931 - భీష్ముడు, యుగంధర మంత్రి, సమదృష్టి, నేల బాలుడు, నెమలి నెలత, లోక బాంధవుడు, అనసూయ, శల్య సారథ్యము, సందేహ డోల
1932 - స్వప్న కథ, అనాధ, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, సింధూరము, బుద్ధ మహిమ, క్రీస్తు, గుంటూరు సీమ, వివేకానంద, చీట్లపేక, జేబున్నీసా, పశ్చాత్తాపం.
1933 - అయోమయము, అఖండ గౌతమి, ఆశ్వాసము, మేఘుడు, స్మశానవాటిక,
1934 - ఆంధ్ర భోజుడు
1941 - గబ్బిలము
1945 - కాందిశీకుడు
1946 - తెరచాటు
1948 - చిన్న నాయకుడు, బాపూజీ, నేతాజీ
1950 - స్వయంవరం
1957 - కొత్తలోకం
1958 - క్రీస్తు చరిత్ర
1963 - రాష్ట్ర పూజ, ముసాఫిరులు
1966 - నాగార్జునసాగరం, నా కథ

అవార్డులు
1964లో క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా నియమితుడయ్యాడు.
1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.
1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం అందజేసింది.
జాషువా కూతురు హేమలతా లవణం, జాషువా స్మారకార్ధం జాషువా సాహిత్య పురస్కారం నెలకొల్పినది. ఈ అవార్డును ప్రతియేటా వివిధ భారతీయ భాషలలోని అత్యుత్తమ కవులకు ప్రదానం చేస్తారు.

చెణుకులు
ఒకసారి జాషువాకు, మరో ప్రముఖ కవికి కలిపి ఒక సాహిత్య బహుమతి ఇవ్వడం జరిగింది. జాషువా అంటే అంతగా పడని ఆ కవి "గుర్రాన్నీ గాడిదనీ ఒకే గాట కట్టేశారు" అని అన్నాడు. అప్పుడు గుర్రం జాషువా "నిజమే, ఈ ఒక్కసారికి మాత్రం ఆయనతో ఏకీభవించకుండా ఉండలేకపోతున్నాను" అని అన్నాడు.
ఈ పద్యంలో కవిలోకానికి జాషువా సనముచిత స్థానం కల్పించేరు.
"రాజు మరణించెనొక తార రాలిపోయె సుకవి మరణిమంచెనొక తార గగనమెక్కె రాజు జీవించు రాతివిగ్రహములయందు సుకవి జీవించు ప్రజల నాల్కలయందు"

బిరుదులూ, పురస్కారాలూ
జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి ఆయన కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నాడు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించాడు.
ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నాడాయన. కవితా విశారద,కవికోకిల, కవి దిగ్గజ - నవయుగ కవిచక్రవర్తి,మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధుడయ్యాడు. పద్మభూషణ, ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కళాప్రపూర్ణ, మొదలైన పురస్కారాలు అందుకున్నాడు.